Awake Brain Surgery | ఆపరేషన్ థియేటర్‌లో ‘ఓజీ’..
Awake Brain Surgery | ఆపరేషన్ థియేటర్‌లో ‘ఓజీ’..
- విజయవంతమైన బ్రెయిన్ సర్జరీ
ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్స చేస్తుంటే.. పక్కనే ల్యాప్‌టాప్‌లో పవన్ కళ్యాణ్ సినిమా ప్రదర్శితమవుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఈ అరుదైన ఘటన నిజంగానే జరిగింది.
ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గణిపిశెట్టి రాఘవులు, కోటేశ్వరమ్మ దంపతులు ఖిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కోటేశ్వరమ్మకు ఇటీవల అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఎంఆర్ఐ సహా పలు పరీక్షలు నిర్వహించగా ఆమె మెదడులో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. దానిని తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరమని తేలింది. అయితే ట్యూమర్ ఉన్న ప్రాంతం కారణంగా రోగిని పూర్తిగా మత్తులోకి పంపకుండా, స్పృహలోనే ఉంచి సర్జరీ నిర్వహించాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన కోటేశ్వరమ్మ ఆందోళన చెందకుండా, మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఆమెకు ఇష్టమైన ‘ఓజీ’ సినిమాను ల్యాప్‌టాప్‌లో ప్లే చేశారు డాక్టర్లు. ఆపరేషన్ టేబుల్ పక్కనే సినిమా చూస్తూ ఉండగానే వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
న్యూరో సర్జన్ డాక్టర్ పద్మనాభుని అరుణ్ కుమార్ నేతృత్వంలో, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ సహా వైద్య బృందం ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ట్యూమర్‌ను పూర్తిగా తొలగించి రోగిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఈ విజయవంతమైన శస్త్రచికిత్సకు డీవీసీ ఆసుపత్రి ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఎండీ ధూళిపాళ్ల జ్యోతిర్మయి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, సీఓఓ కరణం నవీన్ వైద్య బృందాన్ని అభినందించారు. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తూ మెదడు శస్త్రచికిత్స చేయించుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
