అరుగు మీదే ఆఖరి నిద్ర.. ఆటో డ్రైవర్ హత్య కలకలం
అరుగు మీదే
ఆఖరి నిద్ర.. ఆటో డ్రైవర్ హత్య కలకలం
ఆరేళ్లుగా భార్య బిడ్డకు దూరం..
స్నేహితులతో ఘర్షణే కారణమా?
కడప, ఆంధ్రప్రభ బ్యూరో: మైదుకూరు పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న హత్య స్థానికులను కలచివేసింది. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న సంపంగి నాగేంద్రబాబు (38) అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురికావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
నాగేంద్రబాబుకు భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. కుటుంబ విభేదాల కారణంగా భార్య కొంతకాలం క్రితమే చిన్నారిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నాగేంద్రబాబు ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు. ఆటో నడుపుతూ, దొరికినప్పుడు బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
సొంత ఇల్లు ఉన్నప్పటికీ నాగేంద్రబాబు తరచూ రామాలయం సమీపంలోని అరుగు మీదే నిద్రించేవాడు. శనివారం రాత్రి కూడా ఎప్పటిలాగే అక్కడే పడుకున్నాడు. అయితే ఆదివారం ఉదయం అదే అరుగు అతనికి చివరి శయ్యగా మారింది.
స్థానికుల కథనం ప్రకారం, మద్యం సేవించే అలవాటు ఉన్న నాగేంద్రబాబుకు ఇటీవల కొందరు స్నేహితులతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ ఘర్షణే హత్యకు దారితీసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిద్రిస్తున్న సమయంలో అతని తలపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఇందిరమ్మ కాలనీ పట్టణానికి కొంత దూరంలో ఉండడంతో ఆ ప్రాంతంలో తరచూ మద్యం, గంజాయి మత్తులో గొడవలు జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు నాకాబందీలు, బీట్‌లు నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
నాగేంద్రబాబు మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి కోసం ఎదురుచూసే ఆరేళ్ల చిన్నారి, భర్తతో విభేదాలు ఉన్నప్పటికీ అతను ఇలా ప్రాణాలు కోల్పోతాడని ఊహించని భార్య, కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి.
రామాలయం సమీపంలో, మండల రెవెన్యూ కార్యాలయానికి అతి దగ్గరలో ఈ ఘటన జరగడం మరింత చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న మైదుకూరు పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
