మక్క రొట్టెకు మహా డిమాండ్..
మక్క రొట్టెకు మహా డిమాండ్..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఆరోగ్యం పట్ల ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రిపూట భోజనం చేయకుండా ఏదో ఒక రకమైన రొట్టెలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది షుగర్ వ్యాధితో ఇతర వ్యాధులతో ఎంతో మంది బాధపడుతున్నారు. అలాంటివారు ఒక్క పూట భోజనం మాత్రమే చేస్తున్నారు. రాత్రి పూట అల్పాహారం లేదా రొట్టెల వైపు ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామంలో తయారు చేస్తున్న మక్క రొట్టెలకు మహా డిమాండ్ ఏర్పడింది. గ్రామానికి చెందిన తమ్మల లావణ్య హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు సాయంత్రం కట్టెల పొయ్యి పై మక్క రొట్టెలను తయారు చేస్తున్నారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల వారు వాటిని కొనుగోలు చేస్తున్నారు.

ఎంతో రుచిగా రొట్టెలు ఉండడంతో వాటిని తినేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. బిక్కనూర్ మండల కేంద్రంతో పాటు పెద్ద మల్లారెడ్డి, తిప్పాపూర్, బస్వాపూర్ గ్రామాల్లో సైతం పలువురు మక్క రోటేలను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటితో పాటు జొన్న రొట్టె, చపాతీలను సైతం తయారు చేస్తూ వాటిని కావలసిన ఉల్లిపాయ కారంతో పాటు ఇతర చట్నీలను సైతం ఇస్తున్నారు. పలువురు వీటిని వ్యాపారంగా కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మండల కేంద్రంలో పలువురు పెద్ద ఎత్తున సాయంత్రం పూట పలు రకాల రొట్టెలను తయారు చేసి విక్రయిస్తున్నారు.

ఇందులో భాగంగా రాత్రిపూట ఏదో ఒక రకమైన రొట్టెను తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. దీంట్లో భాగంగా రొట్టెలు తయారు చేసే వ్యాపారులకు భలే డిమాండ్ ఏర్పడింది. ఒక్క రోటే 20 రూపాయలకు చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ వాటిని పలువురు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. స్వచ్ఛమైన మొక్కజొన్న పిండితో రొట్టెలను తయారు చేస్తూ విక్రయించడంతో పలువురు ముందుగానే ఫోన్ ద్వారా ఆర్డర్ చెప్తున్నారు. ప్రస్తుతం సమాజంలో రొట్టెల వ్యాపారం ట్రెండ్ గా మారింది.
