CRIMINALS| అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్

- డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకులను మోసం చేస్తున్న ముఠా
- మోసగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన తిరుపతి జిల్లా పోలీసులు
- మొత్తం 8 మంది ముద్దాయిల అరెస్ట్
- 8 మొబైల్ ఫోన్ల స్వాధీనం
CRIMINALS| తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లాలో డిజిటల్ అరెస్టు ముసుగులో కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ల గుట్టు రట్టు చేసి, మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ ని లక్ష్యంగా చేసుకొని డిజిటల్ అరెస్ట్ పేరుతో మాసాలకు పాల్పడుతున్న ఈనెల మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు, జాయింట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న బాధితుడి రూ.2.5 లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. నిందితులు అనంతపూరు జిల్లాకు చెందిన దన్డే క్రాంతి కుమార్, నిమ్మల పవన్ కుమార్, హైదరాబాద్ కు చెందిన మానే కోటి బాబు, రాజమండ్రి ప్రాంతానికి చెందిన పరపాల శ్రీనివాస్, బళ్లారి జిల్లాకు చెందిన మరకట్టు చంద్రశేఖర్ రెడ్డి, కొడేలా శివశంకర్, నగారిధన్ ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్ కు చెందిన గుండవేని గౌతమ్ గా గుర్తించినట్లు తెలిపారు.
ఈ కేసులో తిరుపతి నగరానికి చెందిన 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ను లక్ష్యంగా చేసుకుని, తెలియని వ్యక్తులు వాట్సప్ కాల్ చేసి “ముంబై సీబీఐ అధికారులు”గా తమను పరిచయం చేసుకుని, రూ.583 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అతని పేరు ఉందని చెప్పి భయపెట్టారు. వాట్సప్ వీడియో కాల్ ద్వారా విచారణ చేస్తామని నమ్మబలికి, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి వివిధ ఖాతాలకు డబ్బు పంపాలని ఒత్తిడి చేసి మోసం చేశారు. ఈ విధంగా బాధితుడి నుంచి మొత్తం రూ.80 లక్షలను వివిధ రాష్ట్రాల్లోని మ్యూల్ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. బాధితుడు మోసగాళ్లు స్పందించకపోవడంతో, సైబర్ నేరం జరిగినట్లు గ్రహించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించరన్నారు.
ఎస్పీ ఇంకా మాట్లాడుతూ.. ఎస్టీపీఓ తిరుపతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా, బాధితుడి ఖాతా నుంచి ముందుగా రెండు మ్యూల్ అకౌంట్లకు, అక్కడి నుంచి 14 రాష్ట్రాలలోని ఇతర ఖాతాలకు, చివరికి గేమింగ్ యాప్ వినియోగదారుల ఖాతాలకు నిధులు చేరినట్లు బయటపడింది. విచారణలో ప్రధాన నిందితుడు కోటి బాబుకు టెలిగ్రామ్ ద్వారా హర్యానాలోని డానియల్, చైనాకు చెందిన టియోన్, టియోన్ ఇంకా డీ పేరు తో ఉన్న విదేశీ నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. కోటిబాబు జనవరి 2024లో కంబోడియాకు వెళ్లి 24 రోజుల పాటు అక్కడ సైబర్ మోసగాళ్ల నెట్వర్క్తో కలిసి పనిచేసి తిరిగి వచ్చి, శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, శివశంకర్, ప్రశాంత్ రెడ్డి, గౌతమ్ లాంటి వ్యక్తుల ద్వారా భారీ సంఖ్యలో మ్యూల్ ఖాతాలను సేకరించేవాడని నిర్ధారించి, ఆ అకౌంట్ల వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాక్ష్యాలు అన్నీ టెలిగ్రామ్ ద్వారా విదేశాలకు పంపిస్తూ, ప్రతి లావాదేవీపై కమిషన్ పొందేవారని విచారణలో తేలింది అని అన్నారు.
అదేవిధంగా, క్రాంతి కుమార్, పవన్ కుమార్లు డీకేకే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో తప్పుడు పత్రాలతో జాయింట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి, ఆ ఖాతాలోకి ఈ కేసుకు సంబంధించిన రూ.30 లక్షలు జమై, ఆ తరువాత మొత్తం విదేశీ సైబర్ నెట్వర్క్కు ట్రాన్స్ఫర్ అయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఖాతా మరో కొన్ని కేసుల్లో కూడా వినియోగించబడినట్లు బయటపడడంతో, వాటిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అదనంగా, ఈ అకౌంట్ తెరవడంలో సంబంధిత బ్యాంక్ ఉద్యోగుల ప్రమేయం ఉందా అనేది కూడా విచారిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు మోహమూద్ (యూసఫ్ గూడ, హైదరాబాద్) అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.
“మీ అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే కమిషన్ ఇస్తాం, కేవైసీ పంపు—మంత్లీ ఇన్కమ్ వస్తుంది, కొత్త కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే జీతం వస్తుంది” వంటి ప్రలోభాలు పూర్తిగా సైబర్ నేరగాళ్ల పద్ధతులు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ లావాదేవీల్లో మీ బ్యాంక్ అకౌంట్ను వినియోగించడానికి ఇవ్వడం, సైబర్ నేరానికి సహకరించినట్టే అవుతుందని, అకౌంట్ బ్లాక్ అవ్వడమే కాకుండా ఐపిసి, IT చట్టాల కింద కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటీవల దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టు మోసాలు విస్తరించాయి కాబట్టి, తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వచ్చినప్పుడు స్పందించవద్దని, ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థా వీడియో కాల్ ద్వారా అరెస్టు చేయదని ఆయన మరోసారి గుర్తుచేశారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి గమనించిన సందర్భంలో వెంటనే సైబర్ టోల్ ఫ్రీ 1930, ఎమర్జెన్సీ నెంబర్ 112 లేదా తిరుపతి పోలీస్ వాట్సాప్ 80999 99977 ద్వారా సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఎస్డిపిఓ తిరుపతి, భక్తవచలం, ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, సైబర్ క్రైమ్ సీఐ వినోద్ కుమార్, ఈస్ట్ ఎస్ఐ హేమాద్రి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
