కాశీకి వెళ్లక ముందే…
గయలో ముగ్గురు దుర్మరణం
మృతులందరూ నెల్లూరు వాసులే
మరో 15 మందికి తీవ్రగాయాలు
సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి
తక్షణ వైద్య సేవలకు ఆదేశం
( ఆంధ్రప్రభ, నెల్లూరు బ్యూరో) : బీహార్ లో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడు ప్రమాదంలో నెల్లూరు జిల్లావాసులు ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా సంగం మండలం నుండి జూన్ 1వ తేదీన 43 మంది యాత్రికులు ఒక ప్రైవేట్ బస్సులో కాశీ (వారణాసి) క్షేత్రానికి బయలుదేరారు..
గయ నుండి వారణాసి వైపు ప్రయాణిస్తుండగా, ఔరంగాబాద్ వద్దకు రాగానే వీరి బస్సును ఎదురుగా వస్తున్న మరొక వాహనం బలంగా ఢీకొట్టింది.ఈ ఢీకొన్న ప్రభావం బస్సు ఎడమ వైపున కూర్చున్న ప్రయాణికులపై తీవ్రంగా పడటంతో, ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ముగ్గురు ఏపీలోని నెల్లూరు జిల్లా సంగం, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.గాయపడిన వారు: ఈ ప్రమాదంలో మరో 15 మంది యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
