రేపటి నుంచి ప్రీపెయిడ్ విద్యుత్ అమలు

రేపటి నుంచి ప్రీపెయిడ్ విద్యుత్ అమలు

ఏపీఎస్పీడీసీఎల్ లో 15 కోట్లతో 34,496 ప్రీ-పెయిడ్ సర్వీసులకు రీఛార్జ్

తిరుపతి – ఆంధ్రప్రభ : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్ విధానం జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

సంస్థ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల విద్యుత్ వినియోగం, బిల్లింగ్ అంశాల్లో పారదర్శకతను పెంపొందించేందుకు స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లుగా మార్చాలని సంస్థ నిర్ణయించింది.

ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల బకాయిల సమస్యను అధిగమించడంతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థలపై పడుతున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో ప్రీపెయిడ్ విధానం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ప్రీపెయిడ్ మీటరింగ్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడంతో పాటు విద్యుత్ పొదుపు, బిల్లుల నియంత్రణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని వివరించారు.

రూ.15 కోట్లతో 34,496 సర్వీసులకు రీఛార్జ్

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర ప్రధాన సర్వీసులకు సంబంధించి మొత్తం 34,496 సర్వీసులకు సుమారు రూ.15 కోట్లతో రీఛార్జ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో 4,735 సర్వీసులకు రూ.1.19 కోట్లు, తిరుపతి జిల్లాలో 4,942 సర్వీసులకు రూ.2.29 కోట్లు, చిత్తూరు జిల్లాలో 4,193 సర్వీసులకు రూ.1.63 కోట్లు, అన్నమయ్య జిల్లాలో 4,324 సర్వీసులకు రూ.1.68 కోట్లు, కడప జిల్లాలో 4,520 సర్వీసులకు రూ.1.98 కోట్లు, అనంతపురం జిల్లాలో 2,829 సర్వీసులకు రూ.1.41 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,432 సర్వీసులకు రూ.88.81 లక్షలు, కర్నూలు జిల్లాలో 3,243 సర్వీసులకు రూ.1.63 కోట్లు, నంద్యాల జిల్లాలో 3,278 సర్వీసులకు రూ.1.54 కోట్లు కేటాయించారు.

ఈ సర్వీసులన్నింటినీ పలు గ్రూపులుగా విభజించి ఈ-వాలెట్ ద్వారా రీఛార్జ్ ప్రక్రియను అమలు చేయనున్నారు. ఆయా విభాగాలు బిల్లింగ్ సైకిల్‌కు సంబంధించిన విద్యుత్ చార్జీలు, స్థిర చార్జీల మొత్తాన్ని ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది.

మిగిలిన ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు కూడా దశలవారీగా ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

రీఛార్జ్ చేసుకుంటేనే విద్యుత్

ప్రీపెయిడ్ విధానంలో రోజువారీ విద్యుత్ వినియోగ చార్జీలు అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ నుంచి మినహాయించబడతాయి. బ్యాలెన్స్ నిర్దిష్ట కనిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు సంబంధిత అధికారులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందజేయబడుతుంది.

ప్రీపెయిడ్ బ్యాలెన్స్ పూర్తిగా సున్నాకు చేరినప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రీపెయిడ్ సర్వీస్ వినియోగదారులు గుర్తుంచుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు.