NTR District| అభివృద్ధి, సంస్థాగత బలోపేతానికి చర్యలు
- మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో జిల్లా నేతలతో సమీక్ష
- ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలు, పార్టీ విస్తరణపై సమగ్ర చర్చ
- సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ..
- అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని నిర్ణయం
- విజయవాడ నగరాభివృద్ధి, జిల్లాలో పెండింగ్ అంశాలపై నేతల ప్రతిపాదనలు
- జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యమని స్పష్టం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు, తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు ఢిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నివాసంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని జిల్లా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మైలవరం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్, నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్నతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు ప్రభుత్వ సేవల అందుబాటు, స్థానిక సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలతో నిరంతర అనుసంధానం కొనసాగించే కార్యాచరణపైనా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంల్లో కొనసాగుతున్న రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. విజయవాడ నగర సమగ్రాభివృద్ధి, ఎన్టీఆర్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపే కార్యాచరణ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే పరిపాలనా విధానాలపై కూడా నాయకులు విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, సుస్థిర పాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, జిల్లాలో ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నాయకులు నిర్ణయించారు.

