ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాలి

ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాలి

  • ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
  • అనుమతులేని పాఠశాలలను సీజ్ చేయాలి: విద్యార్థి సంఘాల డిమాండ్

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ విద్యా రంగ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐపీఎస్‌యూ, పీడీఎస్‌యూ, డీ-ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, ఎస్‌ఐఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు.

ఇప్పటి వరకు రాష్ట్రానికి పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వల్ల విద్యారంగ సమస్యలు మరింత పెరిగాయని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతలను మరో మంత్రికి అప్పగిస్తే విద్యారంగంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ప్రైవేట్ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ కొనసాగుతోందని, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందువల్ల ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలను విద్యాశాఖ అధికారులు వెంటనే సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఉమ్మడిగా పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐపీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి విగ్నేష్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గౌతమ్, డీ-ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, ఎస్‌ఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి చక్రీ, ఏఐపీఎస్‌యూ జిల్లా నాయకుడు గోపాల్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు కిషార్, నిరాజ్, నిఖిల్, సాయి పవన్, రాజ్ పవన్ తదితరులు పాల్గొన్నారు.