అమరావతి అభివృద్ధిపై దారుణ కుట్రలు
జనసేన రాష్ట్ర నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రశాంతంగా కొనసాగుతున్న రాజధాని అమరావతి అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి నిర్మాణాలను నిలిపివేయాలన్న ఉద్దేశంతో వైసీపీ మొదటి నుంచే వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అయితే ప్రజల మద్దతు, ప్రభుత్వ చిత్తశుద్ధి కారణంగా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. వైసీపీలోని కొంతమంది నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నిరంతరం విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.
రాజకీయ లాభాల కోసం కుల రాజకీయాలను ప్రోత్సహించడం వైసీపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. రౌడీ షీటర్ కేసులను కూడా కుల కోణంలో మలిచి లబ్ధి పొందాలని చూడటం దారుణమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌ను ఒక కులం లేదా మతానికి పరిమితం చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, ఇది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల్లో కీలక సంస్కరణలు తీసుకువచ్చారని, వాటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. శాఖల్లో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అధికారుల్లో జవాబుదారీతనం పెంచారని ప్రశంసించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకొచ్చిన మార్పులు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయని, గత ప్రభుత్వంలో పంచాయతీ ఉద్యోగులకు ప్రమోషన్లు లభించలేదని, కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మొదటిసారిగా ప్రమోషన్లు అందాయని ఉద్యోగులు స్వయంగా వెల్లడించారని ఆయన పేర్కొన్నారు.
