బొగ్గు నిల్వలపై అన్ని తప్పుడు లెక్కలే..
బొగ్గు నిల్వలపై అన్ని తప్పుడు లెక్కలే..
-రామగుండంలో బొగ్గు నిల్వలు మాయం!
-సింగరేణి తీరుపై హరీష్ రావు ఫైర్
-గోదావరిఖనిలో బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
గోదావరిఖని, ఆంధ్రప్రభ:
సింగరేణి బొగ్గు పరిశ్రమలో బొగ్గు నిల్వల లెక్కలపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తున్న బొగ్గు నిల్వలు వాస్తవానికి సరిపోవడం లేదని, నిజానిజాలు బయటపడకుండా తమను గనుల పరిశీలనకు అనుమతించడం లేదని విమర్శించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరిఖనిలోని సింగరేణి గనుల వద్ద బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధుకర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తదితరులతో కలిసి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రకటిస్తోందని, ఆ లెక్కల ప్రకారం రామగుండంలో కనీసం 5 నుంచి 6 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలని అన్నారు. గతంలో కంప్యూటర్ రికార్డుల్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నట్లు నమోదు చేసినప్పటికీ ప్రస్తుతం ఆ స్థాయిలో నిల్వలు కనిపించడం లేదని ఆరోపించారు.
రామగుండం గనుల్లో 50 వేల టన్నుల బొగ్గు కూడా లేదని పేర్కొంటూ, బొగ్గు నిల్వలు మాయమయ్యాయని హరీష్ రావు ఆరోపించారు. నిజంగా నిల్వలు ఉన్నట్లయితే పరిశీలనకు అనుమతించడంలో తప్పేముందని ప్రశ్నించారు. బొగ్గు నిల్వలపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు తమ బృందాన్ని గనుల వద్దకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
అనుమతి ఇవ్వకపోతే సింగరేణిలో జరుగుతున్న వ్యవహారాలపై కార్మికులకు, ప్రజలకు సమావేశాల ద్వారా వివరాలు వెల్లడిస్తామని హెచ్చరించారు. గనుల పరిశీలనకు వెళ్లిన బీఆర్‌ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ శ్రేణులు సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస రామ్మూర్తి, బీఆర్‌ఎస్ నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
