Apl-5-Cricket : కడపలో క్రికెట్ జాతర..Andhra Prabha Sports Story
- ఇక ఐదురోజులు ఏపీఎల్-5 సందడి..
- వైఎస్ రాజారెడ్డి స్టేడియం వేదికగా టోర్నీ
- ఐదు రోజులపాటు తొమ్మిది మ్యాచ్‌లు..
- తొలిసారిగా కడపలో పరుగుల పండుగ
- అన్ని ఏర్పాట్లు సర్వసన్నద్ధం
- నేడు విజయవాడ సన్ షైనర్స్ –
- తుంగభద్ర వారియర్స్ మధ్య తొలి పోరు
- రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం..
- జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
- ఫ్రీ ఎంట్రీతో అభిమానుల రద్దీకి అవకాశం..
- సింగర్ సునీత గానవిభావరి ప్రత్యేక ఆకర్షణ
( ఆంధ్రప్రభ , విజయవాడ)

Apl-5-Cricket : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్-5) క్రికెట్ పోటీలు బుధవారం నుంచి కడపలో ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఐదు రోజులపాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టోర్నీ విజయవంత నిర్వహణ కోసం స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆటగాళ్లు, అధికారులు, ప్రేక్షకుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. మైదానం, గ్యాలరీలు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, తాగునీటి సౌకర్యాలను సిద్ధం చేశారు. మ్యాచ్‌లతో పాటు వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని అందించేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. టోర్నీలో తొలి మ్యాచ్ నేడు విజయవాడ సన్ షైనర్స్, తుంగభద్ర వారియర్స్ జట్ల మధ్య జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రెండు జట్లు విజయంతో టోర్నీని ఆరంభించాలని భావిస్తున్న నేపథ్యంలో తొలి పోరుపై ఆసక్తి నెలకొంది. స్టేడియంలోకి ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. క్రికెట్ అభిమానులను అలరించేందుకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. తొలి రోజు ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ గాయని సునీత తన గానంతో ప్రేక్షకులు, ఆటగాళ్లను అలరించనున్నారు. క్రీడా వినోదాల సమ్మేళనంగా ఏపీఎల్-5 కడపలో క్రికెట్ సంబరాలకు తెరలేపనుంది.
