గుంటూరు, రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో నేడు జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలు చేస్తున్నదని అన్నారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన నేపథ్యంలో స్పందించిన జగన్ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రనజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.
ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారుల పట ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టిందన్నారు జగన్. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదని పేర్కొన్నారు.
ఎంపీ మిథున్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారని, ఎలాగైనా మిథున్‌రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారన్నారు జగన్. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరో్పించారు. బాబు హయాంలో లిక్కర్ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టిందని గుర్తు చేశారు. . మనం తెచ్చిన లిక్కర్ పాలసీ విప్లవాత్మకమైందని, ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించిందని చెప్పారు. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు.