జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
వ్యక్తి దుర్మరణం
కంచికచర్ల, ఆంధ్రప్రభ:
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని ఇన్వెంటర్ కెమికల్స్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడిని కంచికచర్ల మండలం మొగులూరుకు చెందిన బంకా వెంకటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

