Gandipet | ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్….

Gandipet | ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్….

  • రూ.12 కోట్ల లావాదేవీలపై దర్యాప్తు..
  • కాంచీపురంలో పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతడిని తమిళనాడులోని కాంచీపురం ప్రాంతంలో గుర్తించి నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు.

గండిపేట మండలంలోని సర్వే నంబర్ 18లో ఉన్న సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు రెవెన్యూ రికార్డులు, ఇతర నకిలీ పత్రాలు సృష్టించినట్లు గండిపేట తహసీల్దార్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 23న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 990/2026 కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మల కుటుంబ సభ్యులు, రాధాకృష్ణ, అతని డ్రైవర్ ప్రభీన్ కుమార్‌లను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా, తదుపరి దర్యాప్తు కోసం పోలీస్ కస్టడీ మంజూరైంది.

దర్యాప్తులో సేకరించిన ఆధారాల ప్రకారం బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ, నిమ్మల కుటుంబ సభ్యులు పరస్పర కుట్ర పన్ని ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు అధికారిక పత్రాలు, నకిలీ రికార్డులు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కుట్రలో భాగంగా బొల్లా బ్రహ్మనాయుడు సుమారు రూ.12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. అందులో నిమ్మల కుటుంబ సభ్యులకు రూ.4 కోట్లు, ఇప్పటికే అరెస్టైన రాధాకృష్ణకు రూ.4 కోట్లు, ఇతర సంబంధిత వ్యక్తులకు మరో రూ.4 కోట్లు చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నిధులను నకిలీ జీవోలు, నకిలీ ప్రభుత్వ అనుమతులు, తప్పుడు పత్రాల తయారీ ద్వారా భూమిపై అక్రమ హక్కులు సృష్టించేందుకు వినియోగించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

అరెస్టుకు ముందు బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, కేసు తీవ్రత, ప్రాథమిక ఆధారాలు, దర్యాప్తు దశను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

ప్రస్తుతం బొల్లా బ్రహ్మనాయుడు పోలీసుల అదుపులో ఉండగా, చట్టపరమైన ప్రక్రియలో భాగంగా న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ అధికారుల పేర్లు, సంతకాల దుర్వినియోగం, అలాగే కుట్రలో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Leave a Reply