ముగిసిన దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్
నర్సాపురం, ఆంధ్రప్రభ: ప్రభుత్వం జారీ చేసిన జీవో 396ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమాన్ని శుక్రవారం ముగిసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో సంస్కరణలు అమలు చేసి ప్రజలకు సులభ తరంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు వ్యతిరేకంగా లేఖర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 20న ప్రారంభించి వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేశారు.
చివరి రోజు శుక్రవారం ఫెర్రీ (గోదావరి పై రాకపోకలు జరిపే వాహనం) ఎక్కి గోదారి మాత సాక్షిగా తమ గోడు ప్రభుత్వానికి వినిపించారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫెర్రీ రేవు వద్ద కు ర్యాలీ నిర్వహించి దారి పొడవున జీవో 396ను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటును విరమించుకోవాలని, లేఖర్లు వృత్తి కి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. దస్తావేజు లేఖర్లు పై తెలుగుదేశం ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవ హరిస్తుందని, సంస్కరణలు పేరుతో లేఖర్లు వృత్తిని కనుమరుగు చేసే లక్ష్యం తో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గత 12 రోజులుగా చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమాన్ని నేటితో ముగిసిందని, రేపటి నుంచి తమ విధులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
తాము చేపట్టిన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన పలు ప్రజా సంఘాలు, వై సి పి నాయకులుకు తదితరులకి దస్తావేజు లేఖర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు టి ఎస్ ఎన్, కోయ చింతారావు, దిడ్ల నాగరాజు, టి వి రమణ, జి రవి రామారావు, మోహన్, సురేంద్ర, ఈశ్వర్, ఎస్ రామక్రిష్ణ, జి శ్రీరామమూర్తి, పి రాజు, సాయి, సురేష్, రవి, కె సత్యనారాయణ,సత్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
