ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం..
ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం..
రూ.రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : కృష్ణానదిలో ప్రమాదవశాత్తు ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ సహాయం మంజూరు అయింది. అవనిగడ్డ మండలం మోదుమూడికి చెందిన మత్తి యతిరాజ్ కుమార్, మత్తి వెంకట గోపీ కిరణ్, మత్తి వీరబాబు అనే ముగ్గురు యువకులు గతేడాది ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి ఉత్సవాల సమయంలో కృష్ణానదిలో స్నానాలు చేసేందుకు అవనిగడ్డ శివారు కొత్తపేట వద్ద రేవులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు.
వారి కుటుంబాలకు కనీస భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఘటన వివరాలు తీసుకెళ్లారు. తద్వారా వారు ముగ్గురి కుటుంబాలకు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.రెండు లక్షల చొప్పున ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ సహాయం చెక్కులను మృతుల తండ్రులకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అందచేశారు. కార్యక్రమంలో డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ పాల్గొన్నారు.
