స్వ‌ర్ణ గ్రామం, వార్డు ఉద్యోగులకు సామ‌ర్థ్య నిర్మాణం

స్వ‌ర్ణ గ్రామం, వార్డు ఉద్యోగులకు సామ‌ర్థ్య నిర్మాణం

ప్ర‌తి గురువారం ప్ర‌త్యేక మాడ్యూల్‌తో సెష‌న్లు
రాష్ట్రంలో తొలిసారిగా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వినూత్న చొర‌వ‌!
ఒత్తిడి ర‌హిత వాతావ‌ర‌ణంలో విధుల నిర్వ‌హ‌ణ‌కు బాట‌లు

విజయవాడ, ఆంధ్రప్రభ : గ్రామాలు, వార్డులను ఆదర్శవంతమైన ప‌రిపాల‌న సేవల కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వ‌ర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు కార్యాల‌యాల ఉద్యోగుల‌కు ప్రతి గురువారం మధ్యాహ్నం గంట‌న్న‌ర‌పాటు సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) కార్యక్రమాలను నిర్వహిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఎన్‌టీఆర్ జిల్లా మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి (హెచ్ఆర్‌డీ) సెల్, ఆక‌ర్ష ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో 40 మంది స్వ‌ర్ణ‌గ్రామం-స్వ‌ర్ణ వార్డు సిబ్బందికి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పై తొలి వ‌ర్క్‌షాప్‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సేవల అందజేత, సమస్యల పరిష్కారం, డిజిటల్ సేవల నిర్వహణ, కార్యాలయ వ్యవహారాలు తదితర అంశాల్లో సిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు, ఒత్తిడిని అధిగ‌మించి మంచి ఫ‌లితాలు రాబ‌ట్టే ఉద్దేశంతో వినూత్నంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు తెలిపారు.

శిక్షణల ద్వారా ఉద్యోగులు తమ విధులపై సమగ్ర అవగాహన పెంపొందించుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు లక్ష్యాల సాధనలో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, మారుతున్న సాంకేతికత, పరిపాలనా విధానాలకు అనుగుణంగా నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇందుకోసం వివిధ విభాగాల నిపుణులు శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని సంబంధిత అంశాలపై మార్గనిర్దేశం చేయనున్న‌ట్లు వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో సైకాల‌జిస్టులు జ‌గ‌దీష్‌, న‌విత‌శ్రీ పాల్గొని ఒత్తిడికి కార‌ణాలు, భౌతిక ల‌క్ష‌ణాలు, ఉద్వేగ ల‌క్ష‌ణాలు, ప్ర‌వ‌ర్త‌న‌లో వ‌చ్చే మార్పు, ప‌ని ఒత్తిడికి కార‌ణాలు, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌ను వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో స్వ‌ర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు జిల్లా అధికారి కేవీఎస్ఆర్ ర‌వికుమార్‌, పీజీఆర్ఎస్ నోడ‌ల్ అధికారి జి.జ్యోతి తదిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply