స‌మిష్టి కృషితోనే స‌ర్ విజ‌య‌వంతంగా..

కార్య‌క్ర‌మంలో వ‌చ్చే నాలుగు రోజులు చాలా కీల‌కం
స‌హాయ‌స‌హ‌కారాల్లో ప్ర‌త్యేక అధికారుల కృషి ముఖ్యం
జిల్లాలో 66.16 శాతం మేర ఫారాల డిజిటైజేష‌న్‌..
ఓట‌ర్ల‌కు విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించండి
-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ఎన్‌టీఆర్ జిల్లాలో ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (ఎస్‌ఐఆర్) ప్ర‌క్రియను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో ఓట‌ర్ల‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అందించ‌డం ద్వారా ప్ర‌త్యేక అధికారులు కీల‌క‌పాత్ర పోషించాల‌ని, కార్య‌క్ర‌మంలో వ‌చ్చే నాలుగు రోజులు చాలా కీల‌క‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ బుధ‌వారం పెనుగంచిప్రోలులో ప‌ర్య‌టించారు. క్షేత్ర‌స్థాయిలో స‌ర్ కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించి.. ఎన్యూమ‌రేష‌న్ ఫారాల పంపిణీ, స్వీక‌ర‌ణ‌, ఫారాల డిజిటైజేష‌న్ ప‌నులపై ఆరా తీశారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్ల‌కు తావులేకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై బీఎల్‌వోలు అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

డిజిటైజేష‌న్‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని ఆదేశించారు. ఇటు ఓట‌ర్లు, అటు బీఎల్‌వోలు స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని సూచించారు. క్షేత్రస్థాయి ప‌ర్య‌ట‌న అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క‌లెక్ట‌రేట్ నుంచి ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, ప్ర‌త్యేక అధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఓట‌ర్ల‌కు వివిధ మార్గాల ద్వారా స‌ర్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, ఎన్యూమ‌రేష‌న్ ఫారాలు బీఎల్‌వోల‌కు అంద‌జేసేలా ప్రోత్స‌హించాల‌న్నారు.

66.16 శాతం డిజిటైజేష‌న్‌:…

జిల్లాలో 11,33,618 (66.16 శాతం) ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్ పూర్త‌యింద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. తిరువూరులో 1,67,246 (80.13 శాతం) ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేషన్ జరగ్గా.. విజ‌య‌వాడ ప‌శ్చిమలో 1,43,774 (55.95 శాతం), విజ‌య‌వాడ సెంట్ర‌ల్ 1,61,583 (58.16 శాతం), విజ‌య‌వాడ తూర్పు 1,58,759 (58.86 శాతం), మైల‌వ‌రం 2,08,063 (72.96 శాతం), నందిగామ 1,49,739 (72.17 శాతం), జ‌గ్గ‌య్య‌పేటలో 1,44,454 (69.60 శాతం) మేర ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు వివ‌రించారు.

బీఎల్‌వోలు, అధికారులు ఈసీఐ నియ‌మ‌నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా క్షేత్ర‌స్థాయిలో విధులు నిర్వర్తించేలా ఎలాంటి ప్ర‌భావాల‌కు తావులేకుండా నిష్ప‌క్ష‌పాతంగా నిబ‌ద్ధ‌త‌తో స‌ర్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌డంలో భాగ‌స్వాములయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు కృషిచేయాల‌ని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. టెలీకాన్ఫ‌రెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం త‌దిత‌రులు పాల్గొన్నారు.