ప్రతిభకు వేదికగాశాప్ లీగ్స్ ..

ప్రతిభకు వేదికగాశాప్ లీగ్స్ ..

అన్ని ప్రాంతాలలో సమ్మర్ క్యాంపులు
జిల్లావారీ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు..
యువతకు వేదికగా శాప్ లీగ్స్…
పారదర్శక ఎంపికలకు ప్రాధాన్యం
క్రీడా మౌలిక వసతుల పనులకు వేగం…
నాణ్యతపై రాజీ పడే ప్రసక్తే లేదు..
క్రీడా యాప్ అభివృద్ధిపై దృష్టి…
గ్రామీణ ప్రతిభకు ప్రోత్సాహమే లక్ష్యం
శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి వేగం పెంచే దిశగా స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) కార్యాచరణను కట్టుదిట్టం చేస్తోందని శాప్ చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు. సమ్మర్ క్యాంపులు, క్రీడా అకాడమీలు, లీగ్స్, మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించిన చైర్మన్ రవి నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో… రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మర్ క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

స్కూల్ గేమ్స్ విభాగం, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ శాఖలతో సమన్వయం పెంపొందించి… పిల్లలకు మెరుగైన క్రీడా వాతావరణం కల్పించాలన్నారు. ప్రతి జిల్లాలో సమ్మర్ క్యాంపుల పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. శాప్ లీగ్స్‌ను క్రీడాకారులకు ప్రతిభను ప్రదర్శించే వేదికగా తీర్చిదిద్దాలని చైర్మన్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, స్థానిక క్రీడా సంఘాలు, విద్యాసంస్థల సమన్వయంతో పారదర్శకంగా లీగ్స్ నిర్వహించాలని సూచించారు. త్వరలో పునఃప్రారంభం కానున్న క్రీడా అకాడమీలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ… ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అకాడమీలలో ఆధునిక మౌలిక వసతులు, శిక్షణ పరికరాలు, నిపుణ కోచ్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న క్రీడా వికాస కేంద్రాల పురోగతిని సమీక్షిస్తూ… పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాన్ని క్రీడా రంగంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా ముందుకు సాగాలని సూచించారు. క్రీడా యాప్ అభివృద్ధిపై కూడా సమావేశంలో చర్చించి… యువతకు నమోదు ప్రక్రియలు, శిక్షణ అవకాశాలు, పోటీ వివరాలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శాప్ ఎండీ శ్రీమతి భరణి ఐఎఫ్ఎస్, పరిపాలనాధికారి వెంకటరమావత్ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply