ఎస్ఐఆర్ గడువు నెలరోజులు పొడిగించాలి: కెవిఆర్ మోహన్ చంద్

ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన సీపీఎం నేత

శావల్యాపురం, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గడువును నెలరోజులు పొడిగించాలని సీపీఎం మండల కార్యదర్శి కెవిఆర్ మోహన్ చంద్ డిమాండ్ చేశారు.

మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండలంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదన్నారు. గడువు సమీపిస్తోందనే కారణంతో అధికారులు హడావుడిగా వ్యవహరించడం వల్ల ఎంతో మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటర్లకు తగిన అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అవసరమైన పత్రాలు సమర్పించేందుకు ప్రజలకు సరిపడా సమయం లేనందున ఎస్‌ఐఆర్ గడువును తప్పనిసరిగా పొడిగించాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొంటూ, భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియలో అధికారులు తొందరపాటు కారణంగా అనేక మంది ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే గడువును పొడిగించాలని సీపీఎం తరఫున డిమాండ్ చేశారు.