అదిరిపోయేలా మక్తల్ లో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు…
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని సొంత బజారులో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో ఏర్పాటు చేయనున్న టౌన్ హాల్ ను… పూర్తిస్థాయి హంగులతో అదిరిపోయేలా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.చాలా కాలంగా పట్టణంలో టౌన్ హాల్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న మంత్రి అందులో భాగంగా శుక్రవారం హైదరాబాదులోని రవీంద్ర భారతి, సంత్ సేవాలాల్ భవన్,కొమరంభీమ్ ఇతర భవన్లను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి వెంబడి పంచాయతీరాజ్ డిఇ ఉపేందర్, ఏఈ అరుణ్ సైతం వెళ్ళగా… ఆయా టౌన్ హాళ్లను పూర్తిస్థాయి కొలతలతో పరిశీలించి వాటికి సంబంధించిన పూర్తి రికార్డులను తెలుసుకున్నారు.

మక్తల్ పట్టణంలో సైతం నూతనంగా నిర్మించబోయే టౌన్ హాల్ ను… రవీంద్ర భారతి, సంత్ సేవాలాల్ భవన్ తరహాలో ఎక్కడా రాజీ పడకుండా… అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దేలా మంత్రి వాకిటి శ్రీహరి కృషి చేస్తున్నారు. టౌన్ హాల్ ను అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంచుతూ… అన్ని కార్యక్రమాలు టౌన్ హాల్ లో నిర్వహించేలా పూర్తి సదుపాయాలు అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్ఎం పూర్తిగా మిగిలి ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం లో నిర్మించబోయే టౌన్ హాల్ ను రాష్ట్ర స్థాయి లో తీర్చి దిద్ది, మఖ్తల్ టౌన్ హాల్ ను బెంచ్ మార్క్ గా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. మంత్రి తోపాటు పలు టౌన్ హాల్ లను పరిశీలించిన వారిలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్, మార్కెట్ డైరెక్టర్ సాలంబిన్ ఉమర్ బస్సవి, మంజూర్ ఇలాహి ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.
