రూ.3 కోట్ల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పర్యవేక్షణ

నందికొట్కూరులో అభివృద్ధి పనుల పరిశీలన..

పాఠశాలలో నాణ్యతలేని భోజనంపై ఎమ్మెల్యే ఆగ్రహం

నందికొట్కూరు, ఆంధ్రప్రభ నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్లోక స్కూల్ వరకు రూ.3 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, నూతన రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు ఆదేశించారు.

అనంతరం పట్టణంలోని గాంధీ మెమోరియల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో నిర్దేశిత నాణ్యత పాటించడం లేదని గుర్తించి ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న వసతులు, సమస్యలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి విద్యార్థులకు వడ్డించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పాఠశాల పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.

గతంలో అభివృద్ధికి దూరంగా ఉన్న నందికొట్కూరును ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మూర్తి, జావలి వేణుగోపాల్, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.