లేబర్ కార్డులు చేయించుకోండి- లేబర్ ఆఫీసర్ సుజాత
లేబర్ కార్డులు చేయించుకోండి- లేబర్ ఆఫీసర్ సుజాత
రాప్తాడు, ఆంధ్రప్రభ:
భవన నిర్మాణ కార్మికులు కూలీలు చేతివృత్తులు చేసేవాళ్లు లేబర్ కార్డులు చేయించుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుజాత తెలియజేశారు. సోమవారం రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో బి.విజయలక్ష్మి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుజాత ఆధ్వర్యంలో డిజిటల్ అసిస్టెంట్స్ తో సమావేశం నిర్వహించారు.
ఈ సంధర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుజాత మాట్లాడుతూ భవన, నిర్మాణ రంగ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు. లేబర్ కార్డు నమోదు ప్రక్రియను డిజిటల్ అసిస్టెంట్స్ కు క్లుప్తంగా వివరించారు. ప్రతి గ్రామంలోనూ కూలీలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వివాహ కానుక ప్రసూతి సహాయం సహజ మరణ సహాయం అంత్యక్రియల ఖర్చుల వంటి పథకాలను ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు.
వివాహ కానుక పథకం ద్వారా రూ. 20,000 ప్రభుత్వం అందిస్తోంది. కనీసం 6 నెలలు సభ్యత్వ కాలం ఉండాలి.32 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రసూతి సహాయ పథకం ద్వారా రూ.20,000 అందిస్తోంది.కనీసం 6 నెలలు సభ్యత్వ కాలం ఉండాలి.32 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. సహజ మరణ సహాయ పథకం ద్వారా రూ.60,000 ప్రభుత్వం అందిస్తోంది.కనీసం 1 సంవత్సరం సభ్యత్వ కాలం ఉండాలి.32 నుండి 77 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. అంత్యక్రియల ఖర్చుల పథకం ద్వారా రూ. 20,000 అందిస్తోంది. కనీసం 1 సంవత్సరం సభ్యత్వ కాలం ఉండాలి.
ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్‌బుక్ ప్రతులు సంబంధిత ధృవపత్రాలు మరియు ఇతర అవసరమైన పత్రాలతో ఏపీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో అచుతానంద బాబు సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లు ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.
