ఇంద్రకీలాద్రిపై మొరాయిస్తున్న లిఫ్టులు

ఇంద్రకీలాద్రిపై మొరాయిస్తున్న లిఫ్టులు

భక్తులకు తరచూ తప్పని ఇబ్బందులు

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి:

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం మహా మండపంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్టులు తరచూ మొరాయిస్తున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహా మండపంలో మొత్తం నాలుగు లిఫ్టులు అందుబాటులో ఉన్నప్పటికీ, గత కొన్ని రోజులుగా తరచూ సాంకేతిక లోపాలతో మరమ్మత్తులకు గురవుతూ నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది.

సోమవారం రెండో నంబర్ లిఫ్టులో భక్తులు ప్రయాణిస్తుండగా, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఏడో అంతస్తుకు చేరుకున్న అనంతరం లిఫ్ట్ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో లోపల ఉన్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లిఫ్ట్ తలుపులు చాలాసేపు తెరుచుకోకపోవడంతో లోపల గాలి, వెలుతురు లేక ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి నెలకొంది. లిఫ్ట్‌లో అధిక వేడి కారణంగా కొందరు భక్తులు ఊపిరాడక సొమ్మసిల్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భయంతో లోపల నుంచి అరుపులు, కేకలు వినిపించగా, చివరకు భక్తులే బలవంతంగా తలుపులు తెరవడానికి ప్రయత్నించినట్లు సమాచారం.

అనంతరం సిబ్బంది స్పందించి భక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు 20 నుంచి 30 నిమిషాలకు పైగా లిఫ్ట్ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడాల్సిన బెల్ కూడా పనిచేయలేదని, లిఫ్టులకు సరైన నిర్వహణ లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్పందించి లిఫ్టులకు పూర్తిస్థాయి మరమ్మత్తులు చేపట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. కాస్త శాదితీరిన తరువాత భక్తులు అమ్మవారి దర్శనాన్ని పూర్తి చేసుకోగా కొద్దిసేపు వాళ్ళని కూలర్ల దగ్గర సపరియాలు చేసి సెక్యూరిటీ సిబ్బంది పంపించారు.

Leave a Reply