మరో ఏడాది దుర్గగుడి ఈవోగా శీనా నాయక్
మరో ఏడాది దుర్గగుడి ఈవోగా శీనా నాయక్
-డిప్యుటేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-గడువు ముగియకముందే ఉత్తర్వుల జారీ
-దుర్గగుడి పరిపాలనలో కొనసాగనున్న అనుభవజ్ఞుడైన అధికారి
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నవీకే శీనా నాయక్ కు మరో ఏడాది పాటు పదవీకాల పొడిగింపు లభించింది. రెవెన్యూ శాఖకు చెందిన ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖకు డిప్యూటేషన్ పై వచ్చి ప్రస్తుతం డిప్యుటేషన్‌పై ఈవోగా కొనసాగుతున్న ఆయన సేవలను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా గా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న శ్రీనానాయక్‌ను గత ఏడాది మే 6న దుర్గగుడి ఈవోగా డిప్యుటేషన్‌పై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఆయన అదే నెల 9న బాధ్యతలు స్వీకరించారు. ఆ డిప్యుటేషన్ గడువు ఈ నెల 9తో ముగియనున్న నేపథ్యంలో, గడువు ముగియడానికి ముందుగానే మరో ఏడాది పాటు కొనసాగించేలా తాజా నిర్ణయం తీసుకుంది.
చురుకుగా పని చేసే తత్వం ..
ఇంద్రకీలాద్రిపై ఉన్న ఈ దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, పరిపాలనా సంస్కరణలు, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో శ్రీనానాయక్ కీలకంగా వ్యవహరించినట్లు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు, అలాగే ఈ ఏడాది కూడా ఆలయ కార్యకలాపాల్లో చురుకుగా కొనసాగుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
ఈ తాజా ఉత్తర్వులతో దుర్గగుడి పరిపాలనలో కొనసాగుతున్న కార్యక్రమాలకు నిరంతరత లభించనుండగా, రాబోయే పండుగలు, భక్తుల రద్దీ నిర్వహణ, అభివృద్ధి పనులపై మరింత వేగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా దుఃఖ గుడి మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగం పొందుకొనున్నాయి. నిరంతరం కొండమీద ఆకస్మికంగా పర్యటనలు చేస్తూ భక్తులకు మరిన్ని మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించే దిశగా ఆయన విస్తృత చర్యలు తీసుకుంటున్నారు.
