సమయస్ఫూర్తితో వ్యవహరించిన 108 సిబ్బంది..

సమయస్ఫూర్తితో వ్యవహరించిన 108 సిబ్బంది..

మైలవరం, ఆంధ్రప్రభ : అత్యవసర సమయంలో 108 సిబ్బంది అప్రమత్తంగా స్పందించి గర్భిణికి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేయించి తల్లిబిడ్డల ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున మైలవరం ప్రాంతంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం, జి.కొండూరు గ్రామానికి చెందిన అశోక్ భార్య బలసాని అనూష (19) గర్భవతిగా నెలలు నిండడంతో ప్రసవ నొప్పులతో మైలవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితిని పరిశీలించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు.

దీంతో అనూషను 108 అంబులెన్స్‌లో విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలోని తుమ్మలపాలెం వద్ద ఒక్కసారిగా ప్రసవ నొప్పులు తీవ్రంగా పెరిగాయి. పరిస్థితిని గమనించిన 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) సోమయ్య, పైలెట్ షేక్ శభాషి సమయస్ఫూర్తితో స్పందించి, గర్భిణి బంధువుల సహాయంతో అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. ఈ ప్రసవంలో అనూష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో అనంతరం 108 సిబ్బంది వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అత్యవసర సమయంలో ధైర్యంగా, చాకచక్యంగా వ్యవహరించిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.

Leave a Reply