అమరావతిలో ఏపీఎల్ జోష్
ప్రత్యేక ఆకర్షణగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శ
యువ క్రికెటర్లకు ఏపీఎల్ గొప్ప వేదిక
హీరో రామ్ చరణ్
ట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణతో సందడి చేసిన ప్రారంభోత్సవం
ప్లేఆఫ్స్ రేసులో జట్ల మధ్య ఉత్కంఠభరిత పోటీ
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతమైన మంగళగిరిలో క్రికెట్ సంబరాలు క్రీడాకారులు అభిమానుల్లో జోష్ నింపాయి. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 చివరి దశ మ్యాచ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడగా, టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్…
లీగ్ చివరి దశ మ్యాచ్‌ల ప్రారంభోత్సవానికి సినీ నటుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీఎల్ ట్రోఫీతో పాటు జట్ల జెర్సీలను ఆవిష్కరించిన ఆయన, యువ క్రికెటర్లతో మమేకమై వారిని అభినందించారు. స్టేడియంలో అభిమానుల హర్షధ్వానాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం క్రికెట్, సినీ రంగాల కలయికగా నిలిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఏపీఎల్ అద్భుత వేదికగా మారిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్న యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కే అవకాశాలను ఈ లీగ్ కల్పిస్తోందని పేర్కొన్నారు.

టోర్నీలో పాల్గొంటున్న ప్రతి క్రికెటర్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏసీఏ క్రీడాకారుల కోసం చేపడుతున్న పలు పనులను ఆయన ప్రశంసించారు. అనంతరం క్రీడాకారులను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపి స్టేడియం చుట్టూ కలియ తిరుగుతూ అభిమానులను ఉత్తేజపరుస్తూ సందడిగా గడిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీశ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభమైన సెమీఫైనల్స్ ఫైనల్స్…

ఈ నెల 24 నుంచి 27 వరకు మంగళగిరి స్టేడియంలో ప్రతిరోజూ మధ్యాహ్నం, సాయంత్రం మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 27న లీగ్ దశ ముగియనుండగా, 28 నుంచి ప్లేఆఫ్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30న జరిగే ఫైనల్‌తో టోర్నీకి తెరపడనుంది. ఏడు జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భీమవరం బుల్స్ ఆరు మ్యాచ్‌ల్లో ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశ ముగిసే సమయానికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించనున్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌లపై ఆసక్తి నెలకొంది. ఏపీఎల్ చివరి దశ పోటీలు ఉత్కంఠభరితంగా మారుతుండగా, యువ ఆటగాళ్ల ప్రతిభ, అభిమానుల ఆదరణ, ప్రముఖుల హాజరుతో మంగళగిరి స్టేడియం క్రీడా ఉత్సాహానికి కేంద్ర బిందువుగా మారింది.
