యువత చదువుతోపాటు క్రీడలు పైన దృష్టి పెట్టాలి

యువత చదువుతోపాటు క్రీడలు పైన దృష్టి పెట్టాలి
- ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆముదాలవలస, ఆంధ్రప్రభభ : పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే కప్ టీ20 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ.. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెరగడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే క్రీడాకారులతో పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాటింగ్ చేసి, తొలి బంతిని ఆడి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి పాల్గొన్న జట్లకు స్వాగతం పలుకుతూ క్రీడలను ఆరోగ్యకరమైన పోటీ వేదికగా భావించాలని సూచించారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం కూడా క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడం కోసం ఇలాంటి టోర్నమెంట్‌లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు మాజీ మున్సిపల్ చైర్మన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ , జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్ , రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత ,స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
