Tribal Rights | ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న గిరిజనులు

Tribal Rights | ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న గిరిజనులు

Tribal Rights | తాగునీరు, విద్య, రహదారుల సమస్యలు
కుల ధ్రువీకరణ పత్రాల కోసం నిరీక్షణ
ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న గిరిజనులు
అభివృద్ధి కోసం స్థానికుల విజ్ఞప్తి

Tribal Rights | ఎన్టీఆర్, ఆంధ్రప్రభ బ్యూరో: దేశం డిజిటల్ విప్లవం వైపు పరుగులు తీస్తోంది. కృత్రిమ మేధస్సు నుంచి 5జీ సాంకేతికత వరకు ప్రపంచం కొత్త శకానికి అడుగులు వేస్తోంది. కానీ విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని కొండ ప్రాంతాల్లో మాత్రం కాలం అర్ధ శతాబ్దం వెనక్కి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు లేదు.. పిల్లలకు చదువుకునే పాఠశాల లేదు.. అత్యవసర సమయంలో ఆసుపత్రికి చేరుకునే రోడ్డు లేదు.. ప్రభుత్వ పథకాలు పొందేందుకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు లేవు. దీంతో ఐదు దశాబ్దాలుగా జీవన పోరాటం సాగిస్తున్న వలస గిరిజన కుటుంబాల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయి.

ఒడిశా నుంచి బతుకుతెరువు కోసం..

ఒడిశా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల నుంచి దాదాపు 50 ఏళ్ల క్రితం ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాలు ప్రస్తుతం జి.కొండూరు మండలంలోని లోయ ప్రాంతాలు, కొండల సమీపంలో నివాసం ఉంటున్నాయి. తరతరాలుగా స్థానిక క్వారీల్లో కూలీలుగా పనిచేస్తూ రాళ్లను చెక్కి జీవనం సాగిస్తున్నప్పటికీ వారి జీవితాల్లో మాత్రం అభివృద్ధి వెలుగులు లేవు.

కొండలను తవ్వి కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద వెలికితీసే ఈ ప్రాంతంలోనే కార్మిక కుటుంబాలు కనీస జీవన హక్కుల కోసం ఎదురుచూడటం విస్మయం కలిగిస్తోంది. గ్రామంలో తాగునీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. చెరువులు, గుంతల్లో నిల్వ ఉండే కలుషిత నీటినే తాగడానికి, వంటలకు, స్నానాలకు వినియోగిస్తున్నారు. ఆకుపచ్చ రంగులోకి మారిన నీటిని వాడటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధుల్లో చర్మవ్యాధులు, దద్దుర్లు, అలర్జీలు పెరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

స్వచ్ఛమైన నీటి కోసం ఎన్నోసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం వర్షాలకు దెబ్బతిన్న ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయిన తరువాత నేటి వరకు పునర్నిర్మాణం జరగలేదు.

ప్రస్తుతం చిన్న రేకుల షెడ్డు కింద అంగన్‌వాడీ కేంద్రం మాత్రమే నడుస్తోంది. విద్యార్థులు చదువుకోవాలంటే రోజూ పది కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు భరించలేక అనేక మంది చిన్నారులు మధ్యలోనే చదువుకు స్వస్తి పలికి క్వారీల్లో కూలీలుగా మారుతున్నారు.

ఆధార్, ఓటర్ ఐడీ ఉన్నప్పటికీ..

కుల ధ్రువీకరణ పత్రాల వ్యవహారమే వీరికి తీరని కలగా మారింది. ఒడిశా నుంచి వలస వచ్చిన గిరిజన కుటుంబాలకు ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ అధికారులను సంప్రదిస్తే ఒడిశాకు వెళ్లాలని, ఒడిశాలో సంప్రదిస్తే దశాబ్దాల క్రితమే వలస వెళ్లారని చెబుతున్నారని వాపోతున్నారు.

దీంతో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, యువతకు విద్యా రాయితీలు, వృద్ధులకు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి. అత్యవసర వైద్య సేవలు కూడా అందని ద్రాక్షగానే మారాయి. గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రులకు తరలించాలంటే గుంతలమయమైన రహదారులపై గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు మండలం ప్రస్తుతం 27 గ్రామాలతో కూడిన పరిపాలనా విభాగంగా కొనసాగుతున్నప్పటికీ, కొండ ప్రాంతాల్లోని ఈ వలస గిరిజన కుటుంబాలకు అభివృద్ధి ఫలాలు పూర్తిస్థాయిలో అందడం లేదనే విమర్శలున్నాయి.

దశాబ్దాలుగా క్వారీల్లో శ్రమిస్తూ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న గిరిజన కుటుంబాల సమస్యలను జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. అడవి బిడ్డల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.