ఉత్తరాంధ్ర వాసులు ఉపయోగించుకోవాలి..
ఉత్తరాంధ్ర వాసులు ఉపయోగించుకోవాలి..
శ్రీకాకుళం, అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఉద్యోగార్ధులకు ఉపయోగపడేలా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సన్నధం అయ్యే దిశగా ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.బి, గ్రూప్ డి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే ఉద్యోగార్ధులకు వీలుగా రెండు మాక్ టెస్టులు, శిక్షణా తరగతులు ఇలా ఇప్పటికే అనేక కార్యకమాలు చేపట్టారు. తొలుత శ్రీకాకుళం పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భావించినప్పటికీ.. మిగిలిన ప్రాంతాల నుండి ఉద్యోగార్థులు కోరిక మేరకు పరీక్ష పరిధిని విస్తరించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
శ్రీకాకుళంతో పాటుగా విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లాల నుండి పాల్గొన్న విద్యార్థులు పరీక్షను రాసి.. సంతృప్తిని, భవిష్యత్ పరీక్షలకు సన్నద్ధతను వ్యక్తం చేశారు. అయితే.. గ్రూప్-డి ప్రధాన పరీక్షకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆఖరి మాక్ టెస్ట్ కు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది వరకే రెండు మాక్ టెస్టులను నిర్వహించగా విశేషంగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధాన పరీక్షకు తీసిపోని స్థాయిలో కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్ జరుగుతూ ఉండటం, ప్రశ్నాపత్రం కూడా నిపుణులతో రూపొందించి మంచి మార్కుల సాధనకు ఉపయోగపడుతూ ఉండటంతో ఎర్రన్న విద్యా సంకల్పం మాక్ టెస్ట్ లకు విశేష స్పందన లభిస్తోంది. కాగా ఇదే పరీక్షకు కొనసాగింపుగా నవంబర్ రెండవ తేదీన మరో మాక్ టెస్ట్ ను నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించిన షెడ్యూల్ లు బుధవారం నాడు నిర్వాహకులు విడుదల చేశారు. నవంబర్ 2వ తేదీ ఆదివారం నాడు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కళాశాల రోడ్ దారిలోని కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మాక్ టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ వైవీసశ్రీకాకుళం లైవ్/రిజిస్టర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రోజు ఉదయం పది గంటలకు హాజరు కావాలని కోరారు. గతంలో రిజిస్టర్ చేసుకున్నా సరే.. మరోసారి రిజిస్టర్ అయి హాల్ టికెట్ ను పొందాలని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేవారికి ఈ మాక్ టెస్ట్ లు ఎంతగానో ఉపయోగపడతాయని, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర వాసులు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
