ఏటీఎం దొంగతనం కలకలం..
ఏటీఎం దొంగతనం కలకలం..
రూ. 10 లక్షలు ఎత్తుకెళ్లిన వైనం
శ్రీ సత్య సాయి బ్యూరో ,ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్‌లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని దుండగులు తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడ్డారు. బొలెరో వాహనంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంను పగలగొట్టి, అందులోని నగదు బాక్సును ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల వరకు నగదు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటన అనంతరం దొంగలు బత్తలపల్లి వైపు పారిపోయినట్లు సమాచారం. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, అనుమానాస్పద వాహనాలపై నిఘా పెంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
