రైతుల ఆందోళన

రైతుల ఆందోళన

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కోతల అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. గణపురం మండలం, భూపాలపల్లి మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, మొరంచపల్లి గ్రామాల్లో ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పినా, క్రింది నుంచి నీరు చేరడంతో పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు.

జిల్లాలో నమోదైన వర్షపాతం పరిస్థితిని మరింత స్పష్టంచేస్తోంది. అత్యధికంగా మల్హర్‌రావు మండలంలో 58.6 మి.మీ. వర్షం కురవగా, మహాదేవ్‌పూర్ (42.8), పలిమెల (32.8), భూపాలపల్లి (27.4), మహాముత్తరం (26.2) ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. కాటారం (18.4), ఘన్‌పూర్ (15.2)లో స్వల్ప వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.