అయోధ్య నిధులపై పారదర్శక దర్యాప్తు జరపాలి

బీజేపీ సమాధానం చెప్పాల్సిందే
‘ప్రశ్నించే వారిని మౌనం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం’
‘శ్రీరాముడు సత్యం, ధర్మం, న్యాయానికి ప్రతీక… రహస్యాలకు కాదు’
‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తమ వైఖరి స్పష్టం చేయాలి’
‘సత్యాన్ని శాశ్వతంగా దాచలేరు… ప్రజలే తుది తీర్పు చెబుతారు’
కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు ఇన్చార్జి వల్లూరు భార్గవ్.

విజయవాడ, ఆంధ్రప్రభ : అయోధ్య ఆలయం, ఆలయ సంబంధిత ప్రాజెక్టుల నిధుల వినియోగంపై వెలువడుతున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర, పారదర్శక దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌చార్జి భార్గవ్ వల్లూరు డిమాండ్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నిధుల వినియోగంపై తీవ్రమైన ఆరోపణలు, సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ వాటిపై దర్యాప్తు చేపట్టకుండా, జవాబుదారీతనం కోరుతున్న వారిని దూషించడం, ముద్ర వేయడం, మౌనం చేయడానికి ప్రయత్నించడం సరికాదన్నారు.

అయోధ్య అంశంపై పలువురు గౌరవనీయ సన్యాసులు, మతపెద్దలు, శంకరాచార్యులు కూడా ప్రశ్నలు లేవనెత్తారని, వారిని కూడా హిందూ వ్యతిరేకులుగా ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు. పారదర్శకత కోరడం ఎప్పటి నుంచి హిందూ వ్యతిరేక చర్యగా మారిందని నిలదీశారు. శ్రీరాముడు సత్యం, ధర్మం, న్యాయానికి ప్రతీక అని, రహస్యాలు, బెదిరింపులు, రాజకీయ పరిరక్షణకు కాదని పేర్కొన్నారు. దేశ ప్రజలు జవాబుదారీతనం, దర్యాప్తు, చర్యలను కోరుతున్నారని, ఈ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్నికల వ్యూహాలు, రాజకీయ నినాదాలతో వాస్తవాలను శాశ్వతంగా దాచలేరని, భక్తులకు, దేశ ప్రజలకు నిజాలు తెలియాల్సిన హక్కు ఉందన్నారు.

హిందుత్వ అంటే ప్రజల ముందు నిజాయితీగా ఉండటమేనని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని భార్గవ్ వల్లూరు డిమాండ్ చేశారు. ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలపై మౌనం పాటిస్తే దానిని ప్రజలు సమర్థనగా భావించే అవకాశం ఉందన్నారు. సత్యాన్ని శాశ్వతంగా పాతిపెట్టలేరని, చివరకు ప్రజలే తమ తీర్పు ఇస్తారని భార్గవ్ వల్లూరు తన ప్రకటనలో పేర్కొన్నారు.