శ్రీ గీతం కాలేజీ లైసెన్స్ రద్దు చేయాలి – బీఎస్పీ

శ్రీ గీతం కాలేజీ లైసెన్స్ రద్దు చేయాలి – బీఎస్పీ

అనంతపురం, ఆంధ్రప్రభ: అనంతపురం జిల్లాలోని శ్రీ గీతం జూనియర్ కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వార్తా కథనాలు రాసిన విలేఖరి కొత్తూరు లక్ష్మీనారాయణపై ఆ కళాశాల యాజమాన్యం దాడి చేయడం సిగ్గుచేటని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం పేర్కొన్నారు. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేతలు , ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ను ముట్టటించి ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ , డీఐజీ లకు వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ గీతం కళాశాల కరెస్పాండెంట్ మనీషా నాయర్ క్యాంటీన్ ఇన్‌చార్జి మంగలి శివకుమార్ లోకేష్ తదితరులు గుండాలతో లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి అతని భార్య కుమారుడిపై దాడి చేసి క్షమాపణ చెప్పించి వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ వీడియోలు హెచ్చరికగా ఇతరులకు పంపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటన దళిత జాతి ఆత్మగౌరవం మనోభావాలను గాయపరిచింది. ధన అహంకారంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్లు జర్నలిస్టులు సామాజిక వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జర్నలిస్టులపై ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు.

శ్రీ గీతం జూనియర్ కళాశాలలో అవినీతి ముడుపులు లైసెన్స్ అక్రమాలపై విద్యాశాఖ అగ్నిమాపక ఆహార శాఖలు సమగ్ర దర్యాప్తు చేయాలి. కళాశాల లైసెన్స్ రద్దు చేసి విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి.దాడి చేసిన నిందితుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలిపారు. ఈ ఘటన పైన అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్‌పి డీఐజీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపు ఇస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ సాకే హరి బీఎస్పీ నాయకులు ఎదురూరు ఓబులేసు, బైనేని శ్రీనివాస్ రాజు, హరి ప్రసాద్ గోపాల్, తిరుమలయ్య కత్తుల కోండయ్య ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply