Dharman First Look | ట్రోల్స్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్

ట్రోల్స్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్

‘ధర్మన్’ ఫస్ట్‌లుక్ విడుదల..
‘డెడ్లీ డాక్టర్’ పాత్రలో కనిపించనున్న రజనీ
కమల్ హాసన్ నిర్మాణంలో అశ్విన్ మారీముత్తు దర్శకత్వం
జూన్ 25 నుంచి ‘ధర్మన్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 173వ చిత్రం ‘ధర్మన్’ ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్‌ను చిత్ర బృందం ఘనంగా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ సినిమా విశేషాలతో పాటు తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తుండగా, దర్శకుడు అశ్విన్ మారీముత్తు తెరకెక్కిస్తున్నారు.

“మౌనంగా ఉన్నా విమర్శలే”
తనపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి స్పందించిన రజనీకాంత్.. “నేను మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే మరో సమస్య. మౌనంగా ఉంటే ‘నోట్లో కొయ్యి పెట్టుకున్నాడా?’ అంటారు. మాట్లాడితే ‘ఇప్పుడే మాట్లాడాలా?’ అంటారు” అని వ్యాఖ్యానించారు. తనను ఇష్టపడని వారికి తాను ఏం చేసినా నచ్చదని, ఇష్టపడేవారికి ఏది చేసినా నచ్చుతుందని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి తనకు చాలా సంవత్సరాలు పట్టిందని పేర్కొన్నారు.

దర్శకుడిపై ప్రశంసలు
దర్శకుడు అశ్విన్ మారీముత్తు ప్రతిభావంతమైన యువ దర్శకుడని రజనీకాంత్ కొనియాడారు. ఆయన తెరకెక్కించిన ‘డ్రాగన్’ చిత్రం తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. ఒక సినిమా విజయం కేవలం దర్శకుడి వల్లే కాదని, మొత్తం బృందం సమిష్టి కృషి ఫలితమేనని అన్నారు.

‘డెడ్లీ డాక్టర్’గా రజనీ
‘ధర్మన్’ చిత్రంలో తాను ‘డెడ్లీ డాక్టర్’ పాత్రలో కనిపించనున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు. ఈ చిత్రంలో సిమ్రాన్ కీలక పాత్ర పోషిస్తున్నారని, గతంలో ‘పేట’ సినిమాలో చిన్న పాత్రలో మెప్పించిన ఆమె ఈసారి పూర్తి స్థాయి బలమైన పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. అలాగే రాశి ఖన్నా కూడా ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.

జూన్ 25 నుంచి చిత్రీకరణ
‘ధర్మన్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 25 నుంచి ప్రారంభం కానున్నట్లు రజనీకాంత్ ప్రకటించారు. చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం రజనీకాంత్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.