30 నెలలుగా ఎమ్మెల్యే రేవూరి ఏ అభివృద్ధి చేశారో చూపించాలి
- బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధియే
- పోచంపల్లి ఫౌండేషన్ను విమర్శించడం సరికాదు
- కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు
- జెడ్పి మాజీ చైర్మన్ సాంబారి సమ్మరావు విమర్శ
పరకాల, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి పనులే తప్ప పరకాలలో ఓరగా పెట్టింది ఏమిలేదని బీఆర్ఎస్ పార్టీ పరకాల నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జ్, వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు ఘాటుగా విమర్శించారు.
బుధవారం రోజు పరకాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు, పార్టీ కార్యక్రమాలు మరియు సమకాలీన రాజకీయ పరిణామాలపై, పార్టీ సభ్యత్వ లపై పరకాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బండి సారంగపాణి అధ్యక్షతన ఎఫ్ జె ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సాంబారి సన్మారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలలుగా అవినీతికి తెరలేపిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా లతోపాటు రైతు సాగుచేసే పంటలకు నీరు అందించకుండా రైతులను అరిగోస పెడుతుందన్నారు. కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుల పంటలకు సాగునీరు అందించి రైతులను సంక్షేమం వైపు నడిపించారన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని, పోచంపల్లి ఫౌండేషన్ ను విమర్శించడం సరికాదని, పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అనంతరం టెక్స్టైల్ పార్కుల్లో ఉద్యోగాల అవకాశాలు ఇప్పించుటకై ఫౌండేషన్ శిక్షణ కేంద్రాలు నడుస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేయడం రేవూరి అవగాహన రహితమని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందుతుంటే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మెగా టెక్స్టైల్ పార్కుకు 1300 ఎకరాల భూ సేకరణ, పరకాల పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, పరకాల ఆర్డిఓ, ఎమ్మార్వో కార్యాలయాల నూతన భవనాల నిర్మాణాలు, పాత కూరగాయల మార్కెట్ డెవలప్మెంట్, తాగునీటికై పట్టణంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల నిర్మాణాలు, పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నూతన నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 30 నెలలుగా పరకాలలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని సాంబారి సమ్మారావు సవాల్ విసిరారు.
పట్టణంలోని దామరచెరువు, మండలంలోని గ్రామాలలో చెరువుల నుండి మొరం దోపిడీ, ఇసుక అక్రమంగా రవాణాలతో అక్రమంగా సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సమ్మారావు అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ వైస్ ఎంపీపీ, బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గురిజపల్లి ప్రకాష్ రావు, చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏకు బొబ్బిలి,బొచ్చు కరుణాకర్, వాడికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
