జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్రానికి చారిత్రాత్మక మైలురాయి

భవిష్యత్తులో ‘స్వర్ణగిరి’గా జొన్నగిరికి గుర్తింపు: మంత్రి కొల్లు రవీంద్ర
మైనింగ్ రంగంలో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెడతాం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మైనింగ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచే జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభం రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జొన్నగిరిలో నిర్వహించిన గోల్డ్ మైన్ ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దూరదృష్టి, చొరవతోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని మంత్రి పేర్కొన్నారు. జొన్నగిరి గోల్డ్ మైన్ ద్వారా ఈ ప్రాంతం భవిష్యత్తులో ‘స్వర్ణగిరి’గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మైనింగ్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఖనిజ సంపద వినియోగంలో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. అయితే గత ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్ర మైనింగ్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని విమర్శించారు.

2014-19 మధ్య కాలంలో రాష్ట్ర మైనింగ్ రంగం సుమారు 24 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగగా, గత ప్రభుత్వ హయాంలో అది కేవలం 7 శాతానికి పరిమితమైందన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు, మైనింగ్ కార్యకలాపాలపై నియంత్రణ లోపాలు, స్వార్థపూరిత విధానాల కారణంగా రాష్ట్ర ఖనిజ సంపదకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం రాష్ట్రానికి రూ.19,131 కోట్ల మేర నష్టం జరిగినట్లు వెల్లడైందన్నారు.

ఉచిత ఇసుక విధానంతో ప్రజలకు మేలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పలు సంస్కరణలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, ఇప్పటివరకు సుమారు రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను ప్రజలకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

ఖనిజ వనరుల గుర్తింపులో వేగం

రాష్ట్రంలో కొత్త ఖనిజ వనరులను గుర్తించే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు మంత్రి వెల్లడించారు. బంగారం, బీచ్ శాండ్ ఖనిజాలు, ఐరన్ ఓర్, మ్యాంగనీస్ వంటి విలువైన ఖనిజ వనరుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ చర్యల ఫలితంగా మైనింగ్ రంగ వృద్ధి రేటు 32 శాతానికి చేరుకుని రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచే దిశగా పయనిస్తోందని తెలిపారు.

బంగారు రాష్ట్రంగా ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ను దేశ ఖనిజ అవసరాలను తీర్చగల ప్రధాన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ సుమారు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మైనింగ్ రంగం కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు.

జొన్నగిరి గోల్డ్ మైన్ కేవలం కర్నూలు జిల్లాకే పరిమితం కాదని, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కూడా బంగారు ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపారు. అవసరమైన వేలం ప్రక్రియలను త్వరలో పూర్తి చేసి ఆయా ప్రాంతాల్లో కూడా తవ్వకాలు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన బంగారు ఖనిజ ప్రాంతంగా అవతరించే అవకాశం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర విశ్వాసం వ్యక్తం చేశారు .