TG-TET | జూన్ 30న టెట్ ‘కీ’ !

  • జూలై 2 వరకు అభ్యంతరాల స్వీకరణ

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీటెట్ జూన్-2026) విజయవంతంగా ముగిసింది. జూన్ 16 నుంచి 22వ తేదీ వరకు మొత్తం 10 సెషన్లలో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) ప్రశాంతంగా జరిగినట్లు టీజీటెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేష్ తెలిపారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,15,028 మంది (74.81 శాతం) హాజరయ్యారు. 38,724 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.

పేపర్-1కు మొత్తం 50,113 మంది దరఖాస్తు చేసుకోగా, 36,129 మంది (72.10 శాతం) హాజరయ్యారు. పేపర్-2 (గణితం, సైన్స్)కు 58,675 మంది దరఖాస్తు చేసుకోగా, 44,128 మంది (75.21 శాతం) పరీక్ష రాశారు. పేపర్-2 (సాంఘిక శాస్త్రం)కు 44,964 మంది దరఖాస్తు చేసుకోగా, 34,771 మంది (77.33 శాతం) హాజరయ్యారు.

పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని జూన్ 30న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రకటించారు. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు జూన్ 30 నుంచి జూలై 2 వరకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత అందే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.