యూరియా యాప్ వద్దు.. పాత పద్ధతే ముద్దు..
- యూరియా యాప్ఎత్తి వేయాలని రోడ్డెక్కిన రైతులు
నాగిరెడ్డిపేట, ఆంద్రప్రభ: యూరియా యాప్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో బోధన్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. యూరియా యాప్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తద్వారా యూరియా దొరకడం లేదని వాపోయారు. గ్రామంలో అత్యధికంగా చిన్నకారు రైతులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారని, తమకు ఆండ్రాయిడ్ ఫోనులు లేవని మా దగ్గర కేవలం చిన్న ఫోనులు మాత్రమే ఉన్నాయి యూరియా యాప్ వాడడం తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు.
తమకు యూరియా యాప్ కాకుండా పాత పద్ధతిని యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జాతీయ రహదారి పై రాస్తారోకో చేయడం తో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తన సిబ్బందితో రాస్తోరోకో వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడి సంఘటన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనంతరం ధర్నాను విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భర్త నారాయణ, ఉపసర్పంచ్ జోడు జయరాజు తో పాటు రైతులు,మహిళ రైతులు పాల్గొన్నారు.
