తాడిపత్రి రాజకీయాల్లో కీలక మలుపు!
తాడిపత్రి రాజకీయాల్లో కీలక మలుపు!
జేసీతో మంత్రి భరత్ మంతనాలు.. ధర్నా వాయిదా వెనుక ఏముంది?
అనంతపురం, ఆంధ్రప్రభ: తాడిపత్రిలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక సమీక్ష నిర్వహించారు. సోమవారం జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి, పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
పెద్దారెడ్డితో చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో పరిస్థితులు చేయి దాటకుండా ఉండేందుకు పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వాస్తవానికి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యకర్తలను సమాయత్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ పరిణామం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావచ్చనే ఉద్దేశంతో అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రి టీజీ భరత్ హుటాహుటిన తాడిపత్రికి చేరుకుని ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేయించినట్లు తెలుస్తోంది.
తాడిపత్రి అంశాన్ని ప్రభుత్వం అత్యంత సున్నితంగా పరిశీలిస్తున్నదని, పరిస్థితులు అదుపులో ఉండేలా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి భరత్ పేర్కొన్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేయాలని కోరినా పోలీసులు స్పందించలేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో తమ కుటుంబంపై అనేక కేసులు నమోదు చేశారని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం.
తాడిపత్రిలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి-జేసీ భేటీ జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
