గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు..
గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు..
భద్రతా వ్యవస్థ మరింత పటిష్టం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజల సహకారంతో గ్రామాల్లో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ధర్మవరం రూరల్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఆదేశాల మేరకు ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగటాపల్లి, మాచురామి, దర్శినమల, మల్లినేపల్లి గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో ప్రధాన కూడళ్లు, రహదారులు, ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వాహనాల రాకపోకలు, అలాగే శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలను సమర్థవంతంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని, సీసీ కెమెరాల నిఘా వల్ల నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో భయం నెలకొని నేరాల సంఖ్య తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.
అలాగే ఏదైనా నేరం జరిగిన సందర్భంలో నిందితులను గుర్తించడం, సంఘటనలపై దర్యాప్తు వేగవంతం చేయడం, ఆధారాలను సేకరించడం వంటి అంశాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఆధునిక నిఘా వ్యవస్థల వినియోగంతో గ్రామాల్లో భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాల వ్యవస్థ గ్రామాల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు దోహదపడుతుందని సీఐ ప్రభాకర్ పేర్కొన్నారు. గ్రామాల్లో సురక్షిత వాతావరణం నెలకొల్పడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, దాతలు, యువకులు, గ్రామ ప్రజలకు ధర్మవరం రూరల్ పోలీసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా పోలీసు శాఖ చేపట్టే ప్రజా భద్రత కార్యక్రమాలకు ఇదే విధంగా సహకరించాలని కోరారు. గ్రామ స్థాయిలో ప్రజలు-పోలీసుల సమన్వయంతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం నేరాల నివారణకు ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో భద్రతా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
