ప్రశాంతంగా..ఎస్‌ఎస్‌సీ సప్లమెంటరీ పరీక్షలు

ప్రశాంతంగా..ఎస్‌ఎస్‌సీ సప్లమెంటరీ పరీక్షలు

రెండో రోజు హాజరు శాతం 12.35గా నమోదు..
ఏపీఓఎస్‌ఎస్‌ పరీక్షల్లో మెరుగైన హాజరు..
జిల్లాలో 21 పరీక్షా కేంద్రాల తనిఖీ

విజయవాడ, ఆంధ్రప్రభ, ఎన్‌టీఆర్ జిల్లాలో ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. రెండో రోజు నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్‌ (హిందీ) పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారిఎల్‌. చంద్రకళ తెలిపారు. జిల్లాలో మొత్తం 259 మంది విద్యార్థులకు గాను 32 మంది హాజరుకాగా, 227 మంది గైర్హాజరయ్యారు. దీంతో హాజరు శాతం 12.35గా నమోదైంది. ఇక ఏపీఓఎస్‌ఎస్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు కూడా జిల్లాలోని 15 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడ్డాయి. ఎస్‌ఎస్‌సీ ఇంగ్లీష్‌, ఇంటర్ హిందీ, తెలుగు, ఉర్దూ పరీక్షలకు కలిపి మొత్తం 527 మంది విద్యార్థులు నమోదు కాగా, 407 మంది పరీక్షలకు హాజరయ్యారు.

120 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఎస్‌ఎస్‌సీ విభాగంలో హాజరు శాతం 69.2గా, ఇంటర్ విభాగంలో 83 శాతంగా నమోదైనట్లు విద్యాశాఖ పేర్కొంది. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌. చంద్రకళ విజయవాడలోని కేఎస్‌ఆర్ జడ్‌పీ బాలికల ఉన్నత పాఠశాల, పటమట మున్సిపల్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలను స్వయంగా సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా జిల్లాలో నియమించిన రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మొత్తం 19 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షణ నిర్వహించాయి.

మొత్తంగా 21 కేంద్రాలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెల్లడించారు.

Leave a Reply