ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం..

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం..

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కన్స్యూమర్ కోర్టు ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువర్ మాట్లాడుతూ, వినియోగదారులను అనైతికంగా, అన్యాయంగా మోసగించే వ్యాపారస్తుల నుండి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో వినియోగదారుల రక్షణ చట్టాన్ని రూపొందించిందని తెలిపారు. జిల్లా కన్స్యూమర్ కమిషన్ అధ్యక్షుడు కరణం కిశోర్ కుమార్, కమిషన్ సభ్యురాలు నజ్మా కౌసర్ మాట్లాడుతూ, వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు లేదా పొందే సేవల్లో మోసం జరిగితే కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అలాగే 1915 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా లేదా ejagruthi.com వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని వివరించారు.

కన్స్యూమర్ కమిషన్ సభ్యుడు నారాయణ రెడ్డి మాట్లాడుతూ, వ్యాపారులు వినియోగదారులను మోసగించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ కొనుగోళ్లలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
సెట్కూర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, వినియోగదారులు ఏ వస్తువును కొనుగోలు చేసినా దానికి సంబంధించిన ప్రమాణాలు ఉన్నాయా లేదా పరిశీలించి కొనాలని, తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆహార పదార్థాల్లో కల్తీ విషయంలో కూడా అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. లీగల్ మెట్రోలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీరాములు మాట్లాడుతూ, తూకాల్లో ఎక్కువగా మోసాలు జరుగుతాయని, ప్యాకెట్ వస్తువులపై ధర, గడువు తేది, తూకు, తయారీదారు చిరునామా వంటి వివరాలు స్పష్టంగా ఉన్నాయా లేదో వినియోగదారులు పరిశీలించాలని తెలిపారు.

జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇన్‌చార్జ్ నదీం హుస్సేన్ మాట్లాడుతూ, వినియోగదారులకు జరిగే అన్యాయాలను నివారించేందుకు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువర్, జిల్లా కన్స్యూమర్ కమిషన్ అధ్యక్షుడు కరణం కిశోర్ కుమార్, సభ్యులు నారాయణ రెడ్డి, నజ్మా కౌసర్, లీగల్ మెట్రోలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీరాములు, సెట్కూర్ సీఈఓ వేణుగోపాల్, డీసీఐసీ ఇన్‌చార్జ్ నదీం హుస్సేన్, వినియోగదారుల రక్షణ మండలి జిల్లా కార్యదర్శి ఎ. శివమోహన్ రెడ్డి, న్యాయశాస్త్ర విద్యార్థులు, వినియోగదారులు మరియు పౌర సరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.