గుర్తింపు లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి..

గుర్తింపు లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి..

ఆర్‌ఐఓ కార్యాలయం ముట్టడించిన పీడీఎస్‌యూ నేతలు..

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఓ) కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్‌ఐఓ ఛాంబర్‌ను ముట్టడించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు కె. రమణకుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ గుర్తింపు లేకుండానే రిసోనెన్స్, నానో, వేదాంత్, అలియాన్ తదితర కళాశాలలు పెద్దఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసి అక్రమ అడ్మిషన్లు చేపడుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి పి. రంజిత్ భాష మార్చి 18న విడుదల చేసిన ఆదేశాల ప్రకారం అడ్మిషన్ల కోసం హోర్డింగులు, కరపత్రాలు, గోడలపై ప్రకటనలు, మీడియా ప్రచారాలు చేయరాదని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, జిల్లాలో అవి పూర్తిగా అమలుకావడం లేదని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొన్ని కళాశాలలు విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ నగరంలో పలు కళాశాలలు బహిరంగంగా తరగతులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న కళాశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు వెంకటస్వామి, అస్లం భాష, శివ, ఉపేంద్ర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply