ఇథనాల్ మిశ్రమంపై కేంద్రం దృష్టి

ఇథనాల్ మిశ్రమంపై కేంద్రం దృష్టి
ఢిల్లీ: చమురు సంక్షోభంను ఎదుర్కొనేందుకు, భవిష్యత్తులో ముడి చమురు దిగుమతులను తగ్గించేందుకు భారతదేశం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే, భవిష్యత్తులో కొరత సవాళ్లును అధిగమించేందుకు పెట్రోల్లో ఇథనాల్‌ను ఎక్కువగా కలపాలని భారత్ నిర్ణయించింది. ప్రస్తుతం 20 శాతంగా ఉన్న ఇంధన మిశ్రమాన్ని 80 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఇందుకోసం అవసరమైన ఇథనాల్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఇది మరొక సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారీ స్థాయిలో ఇథనాల్ ఉత్పత్తి చేయాలంటే అంతకంటే భారీ పరిమాణంలో నీరు అవసరం. నిపుణుల అంచనా ప్రకారం, ఒక లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి పది వేల లీటర్ల నీళ్లు అవసరం. ఎందుకంటే ఇథనాల్ ఉత్పత్తి చేయాలంటే చెరుకు, జొన్న, వరి అవసరం. ఈ పంటలకు భారీగా నీళ్లు అవసరం. ఇండియాలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 1,822 కోట్ల లీటర్లు. ఈ స్థాయిలో ఇథనాల్ ఉత్పత్తి కావాలంటే జొన్న, వరి, చెరుకు పంటలు కూడా అధిక స్థాయిలో ఉత్పత్తి కావాలి. ఈ పంటలకు ఇతర పంటలతో పోలిస్తే ఎక్కువ సాగునీరు అవసరం. అంటే, కేంద్రం గనుక ఇథనాల్‌ను అధికంగా ఉత్పత్తి చేయాలని భావిస్తే, దీనికి అనుగుణమైన పంటల సాగును ప్రోత్సహించాలి. దీనివల్ల దేశంలో సాగునీటి కొరత ఇంకా పెరుగుతుందిని నిపుణులు అంటున్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు తీవ్ర నీటి సంక్షోభంను ఎదుర్కొంటున్నాయి. వరి పంట సాగు చేసి, దాని ద్వారా ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తి అయ్యే వరకు మొత్తం 10,790 లీటర్ల నీళ్లు అవసరమవుతాయని అంచనా. ఇదే జొన్న నుంచి అయితే 4,670 లీటర్ల నీళ్లు, చెరుకు నుంచి అయితే 3,630 లీటర్ల నీళ్లు అవసరం. ఒక కిలో బియ్యం ఉత్పత్తి కావడానికి 3,000 లీటర్ల నీళ్లు అవసరం. ఒక టన్ను వరి నుంచి 470 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఇథనాల్ తయారీ పరిశ్రమ నుంచి కూడా అనేక నీటి వ్యర్థాలు విడుదలవుతాయి. ఇవి పర్యావరణానికి మరింత హాని చేస్తాయి.
ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాలు తీవ్ర నీటి సంక్షోభంను ఎదుర్కొంటున్నాయి. కొన్నిచోట్ల మంచి నీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటిది ఇథనాల్ ఉత్పత్తి కోసం ఆయా పంటలను ప్రోత్సహిస్తే నీటి సంక్షోభం మరింత పెరుగుతుందిని నిపుణులు అంటున్నారు. 2024-25లో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ తయారీ కోసం 52 లక్షల టన్నుల వరిని, 2025-26లో 90 లక్షల టన్నుల వరిని కేటాయించింది.
