ఆరోగ్య సేవల్లో నాణ్యత పెంచాలి
- ప్రజల సంతృప్తే పనితీరుకు కొలమానం
- డీఎంహెచ్‌వో డాక్టర్ ఏ. శ్రావణ్ బాబు
- రాష్ట్ర ప్రభుత్వ సూచికల అమలుపై ప్రోగ్రామ్ అధికారులతో సమీక్ష
విజయవాడ, ఆంధ్రప్రభ: జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. శ్రావణ్ బాబు అధికారులను ఆదేశించారు. ప్రతి గురువారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నిర్వహించే జూమ్ సమీక్ష సమావేశం అనంతరం, డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా స్థాయి ప్రోగ్రామ్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పనితీరు సూచికలు, ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణ, ఆరోగ్య కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఫీల్డ్ స్థాయి పర్యటనల సమయంలో ప్రతి అధికారి తప్పనిసరిగా పరిశీలించాల్సిన కీలక పారామీటర్లపై డీఎంహెచ్‌వో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సూచికల ప్రకారం ప్రతి ఆరోగ్య కేంద్రం పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి, లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.
జిల్లాలో రోగనిరోధక టీకా కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి, అర్హులైన ప్రతి చిన్నారికి, గర్భిణికి టీకాలు అందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. టీకాల కార్యక్రమంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. ప్రతి ప్రోగ్రామ్ అధికారి తన పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణ, ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని డీఎంహెచ్‌వో సమీక్షించారు. లక్ష్య సాధనలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు.
ప్రజల అభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ గురించి సేవలు పొందిన ప్రతి లబ్ధిదారునికి వివరించి, వారు స్కాన్ చేసి ‘పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్’ ద్వారా తమ అభిప్రాయాన్ని నమోదు చేసేలా సిబ్బంది చొరవ చూపాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఇందుమతి దేవి, జిల్లా రోగనిరోధక టీకాల అధికారి (డీఐఓ) డాక్టర్ శరత్ బాబు, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాధవి నాయుడు, జిల్లా మలేరియా అధికారి శ్రీను నాయక్, ఎన్‌హెచ్‌ఎం జిల్లా ప్రోగ్రామ్ అధికారి మహేశ్వరరావు, డీఎంహెచ్‌వో కార్యాలయ వైద్యులు డాక్టర్ సునీల్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ శ్రావణి, జిల్లా ప్రజారోగ్య నర్సింగ్ అధికారి రేణుకతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
