ఏపీ-ఏఐఎంఎస్‌తో ఎరువుల పంపిణీలో పారదర్శకత

ప్రతి అర్హ రైతుకు ఎరువుల సరఫరా..

అక్రమాలకు అడ్డుకట్ట: కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించడంతో పాటు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ-ఏఐఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ-పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగా ప్రతి రైతుకు ఎరువుల కోటా నిర్ణయిస్తున్నామని చెప్పారు.

రైతులు తమ అవసరాన్ని బట్టి ఒకేసారి లేదా విడతల వారీగా ఓటీపీ లేదా బయోమెట్రిక్ ధృవీకరణతో ఎరువులు పొందవచ్చన్నారు. ఈ విధానంతో ఒకే రైతు పలుమార్లు ఎరువులు కొనుగోలు చేసే అవకాశానికి అడ్డుకట్ట పడడంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు సమానంగా ఎరువులు అందుతాయని వివరించారు.

ఈ-పంటలో నమోదు కాని రైతులు లేదా సాంకేతిక సమస్యల కారణంగా వివరాలు కనిపించని వారు సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే వెంటనే వివరాలు సరిచేసి ఎరువులు అందించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో వివరాలు లేకపోయినా ఈ-పంట నమోదు పూర్తయిన వెంటనే అర్హ రైతులకు ఎరువులు అందజేస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాకు సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేయగా, ఇప్పటికే 7 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు 5 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు విక్రయించగా, 19,422 మంది రైతులు ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఎరువులు పొందినట్లు వెల్లడించారు.

రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువులు అందుబాటులో ఉంచామని చెప్పారు. కౌలు రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని భూ యజమాని ఓటీపీ ద్వారా కూడా ఎరువులు పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. రైతుల సూచనల మేరకు సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన చోట ఎరువుల కోటాలను పెంచినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేసే ప్రైవేట్ ఎరువుల డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేసి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ప్రతి వారం ఎరువుల నిల్వలను సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా అదనపు సరఫరా చేస్తున్నామని, డిసెంబర్, జనవరి నెలల్లో పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో నిల్వలు పెంచనున్నట్లు తెలిపారు.

ఏపీ-ఏఐఎంఎస్ మొబైల్ యాప్ ద్వారా వాతావరణ సమాచారం, వర్షపాతం అంచనాలు, నేల ఆరోగ్య వివరాలు, పంట ఆరోగ్య విశ్లేషణ, ఎరువులు, పురుగుమందుల వినియోగంపై సూచనలు పొందవచ్చని తెలిపారు. పంట ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే పంట ఆరోగ్య విశ్లేషణ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంటూ రైతులు తప్పనిసరిగా యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి పాల్గొన్నారు.