youth-dies | తగువారిపల్లిలో కలకలం

గొడవలో హత్యా? ప్రమాదవశాత్తూ జరిగిందా?.. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు

youth-dies | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తగువారిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకున్న అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన కూలీలు నివసిస్తున్న ప్రాంతంలో జరిగిన ఘటనలో ఓ యువకుడు కత్తిపోటుకు గురై మృతి చెందాడు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం మహారాష్ట్రకు చెందిన నలుగురు కూలీలు తగువారిపల్లిలో ఒకేచోట నివసిస్తూ స్థానికంగా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ భాస్కర్ ఖడ్గి, సంతోష్ వర్మ మధ్య శనివారం రాత్రి గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ ఘర్షణలో సంతోష్ వర్మ ఛాతిపై కత్తిపోటు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరోవైపు నిందితుడు రోహిత్ భాస్కర్ ఖడ్గి మాత్రం కూరగాయలు కోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కత్తి తగిలిందని చెబుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదవశాత్తూ జరిగిందా, గొడవలో జరిగిన హత్యా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.