శ్రీవాణి టికెట్లపై ఆరోపణలు అసత్యం..

శ్రీవాణి టికెట్లపై ఆరోపణలు అసత్యం..

  • పారదర్శకంగా ఆన్‌లైన్ విధానం అమలు చేస్తున్నాం: టీటీడీ

తిరుమల, ఆంధ్రప్రభ : శ్రీవాణి టికెట్లు, టీటీడీ ఐటీ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా వాస్తవ దూరమని తిరుమల తిరుపతి దేవస్థానాలు స్పష్టం చేసింది. భక్తులకు పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా శ్రీవాణి ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపింది. టీసీఎస్ సహకారంతో 2019 మే నెలలో ప్రారంభించిన ఆన్‌లైన్ శ్రీ‌వాణి టికెట్ విధానాన్నే ప్రస్తుతం కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

భక్తుల విజ్ఞప్తి మేరకు తిరుమలలో ఆఫ్‌లైన్ టికెట్ల జారీ విధానంలో మార్పులు చేసినట్లు పేర్కొంది. ముందుగా సాఫ్ట్‌వేర్ యాక్సెస్ చేసిన వారికి ముందుగా టికెట్లు లభించేలా వ్యవస్థను రూపొందించినట్లు తెలిపింది. రోజుకు వేల సంఖ్యలో భక్తులు టికెట్ల కోసం ప్రయత్నిస్తుండటంతో మొదటి ఒకటిన్నర నిమిషంలోనే టికెట్లు లాక్ అవుతున్నాయని వివరించింది.

అనంతరం పేమెంట్ గేట్‌వే ద్వారా విజయవంతంగా చెల్లింపులు పూర్తైన వారికి మాత్రమే టికెట్లు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. చెల్లింపులు విఫలమైతే ఆ టికెట్లు తిరిగి పూల్‌లోకి వచ్చి ఇతర భక్తులకు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. పది నిమిషాల తర్వాత టికెట్లు అందుబాటులోకి రావడం కూడా ఇదే ప్రక్రియలో భాగమని, పేమెంట్ గేట్‌వే సాంకేతిక కారణాలతో చెల్లింపు నిర్ధారణ రాకపోతే టికెట్లు తిరిగి విడుదలయ్యేలా సాఫ్ట్‌వేర్ రూపొందించామని వెల్లడించింది. ఈ విధానంలో మానవ ప్రమేయం పూర్తిగా తొలగించామని, సిస్టమ్ ఆటోమేటిక్‌గా పనిచేస్తోందని స్పష్టం చేసింది. జీఎం ఐటీగా కనీస అర్హతలు లేని వ్యక్తిని నియమించారన్న ఆరోపణలను కూడా టీటీడీ ఖండించింది.

ఎం.టెక్ (కంప్యూటర్ సైన్స్), ఎం.ఎస్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) అర్హతలతో పాటు 32 సంవత్సరాల ఐటీ అనుభవం ఉన్న వ్యక్తిని స్టాప్ గ్యాప్ అరేంజ్‌మెంట్ కింద ఎఫ్ఏసీగా నియమించినట్లు తెలిపింది. టీసీఎస్ కొత్త సాఫ్ట్‌వేర్ తీసుకురాలేదని, 2019లో ప్రవేశపెట్టిన సాఫ్ట్‌వేర్‌కే భక్తుల సూచనల మేరకు కాలానుగుణంగా మార్పులు చేస్తున్నామని వివరించింది. అలాగే ఆటో ఫిల్లింగ్, కాపీ-పేస్ట్ విధానాలను పూర్తిగా రద్దు చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొంది.

టీటీడీలోని అన్ని ఐటీ వ్యవస్థలను ప్రతి సంవత్సరం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఆడిట్ చేయిస్తున్నామని వెల్లడించింది. ఇటీవల మాజీ టీటీడీ చైర్మన్ ప్రదర్శించిన శ్రీ‌వాణి టికెట్ బుకింగ్ ప్రక్రియపై కూడా టీటీడీ స్పందించింది. వారి అకౌంట్‌లో తగినంత నగదు లేకపోవడంతో పేమెంట్ గేట్‌వే వద్ద ట్రాన్సాక్షన్ విఫలమైందని, దానిని సాంకేతిక లోపంగా చూపించడం సరైంది కాదని పేర్కొంది. తిరిగి చేసిన ప్రయత్నం కొత్త బుకింగ్‌గా పరిగణించబడటంతో వారు వెయిటింగ్‌లో వెనుకబడినట్లు వివరించింది.

Leave a Reply