నల్లమల్ల మొగ్గలు రాస మల్ల రత్నావళి పుస్తకావిష్కరణ

లింగాల, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో నెలపొడుపు సాంస్కృతిక సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రకృతి కవి రాసమల్ల చంద్రయ్య రచించిన ‘నల్లమల్ల మొగ్గలు’, ‘రాసమల్ల’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, సాహితీవేత్త బెక్కెం జనార్ధన్ పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన వక్తలు, కవి చంద్రయ్య తన రచనల్లో సామాజిక చైతన్యం, సర్వమత సమభావన, మానవ సౌభ్రాతృత్వం, నల్లమల్ల ప్రకృతి సోయగాలు, అడవులు, అమ్మ, తండ్రి వంటి అంశాలను ప్రతిబింబించారని పేర్కొన్నారు.

పల్లెటూరి భాషా సౌందర్యాన్ని, భాషపై ప్రేమను తన కవిత్వంలో ప్రతిఫలింపజేస్తూ ప్రత్యేక శైలిని చాటుకున్నారని కొనియాడారు. పాలమూరు మాండలిక భాషను తనదైన రీతిలో ఆవిష్కరించారని తెలిపారు.

ఈ పుస్తకాలలో దాదాపు 200 కవితలు పొందుపరిచినట్లు వెల్లడించారు. కార్యక్రమానికి వహీద్ ఖాన్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, సాహితీవేత్తలు వనపట్ల సుబ్బయ్య, బోలే యాదయ్య, కె.పీ. నరసింహ, ఆశీర్వాదం, ఎదరపల్లి కాశన్న, గంట మనోహర్ రెడ్డి, శ్రీకాంత్, నల్లగొండ శ్రీనివాస్, మద్దిలేటి, రచయిత రాసమల్ల చంద్రయ్యతో పాటు గ్రామస్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.